ప్రశ్నార్ధకం రైతు భవిత
ఆకాశం వట్టిపోయింది
మేఘాలు చచ్చుబడ్డాయి
బీటలువారింది పంట భూమి
మొలకెత్తని విత్తనాలు
పనిచేయని కల్తీ ఎరువులు
వెక్కిరిస్తున్నాయి రైతుని జూసి
వెర్రి విక్రమార్కుడా
మానవోయ్ నీ ప్రయత్నమంటూ!!
మానవీయత లేని
వ్యాపారుల కారు చక్రాలక్రింద
నలిగిపోతున్న రైతు జీవితం
ప్రకృతినే శపిస్తోంది
పరమేశుడినే నిందిస్తోంది
వరమీయని దైవాలు,
వర్షించని మేఘాలు,
కరుణించని ప్రభుత్వాలు
వ్యాపారులతో చేయి కలిపాయా?
ఈ పాపాన్ని కలసి పంచుకుంటూ
కరువుకు ఎరువు వేసాయా?
మంచి రోజులు వస్తాయని
ఎన్నాళ్ళు భ్రమింప జేయటం!!
రాళ్ళు కరుగుతాయని
ఎలా ఇంకా నమ్మటం!!
ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతోంది
మొలకెత్తేవి మొక్కలు కాదు ప్రశ్నలే
ప్రశ్నల మొలకలు!
ప్రశ్నల చిగుర్లు!!
ప్రశ్నార్ధకమైన పంటల మధ్య
ప్రశ్నార్ధకమైంది రైతు భవిత!!
Comments
Post a Comment