దౌర్భాగ్యపు తండ్రీ
నాయనా కొడుకును గన్న తండ్రీ!
ఏమి పెంపకంరా నీది!!
వందలు వేలు చేసి,
వేలు లక్షలు చేసి, కోట్లకు ఎదగడం
తెలుసు నీకు.
నీ ధన యజ్ఞంలో కమ్ముకొస్తున్న పొగలు
నీ కొడుకుకు కొమ్ములు మొలిపించాయి
పశువులా అతడు ఏం చేస్తున్నాడో
గమనించే తీరిక నీకు లేదా?
నువ్వు కొని ఇచ్చిన ఖరీదైన కారుకి
కాలయముని ఢీ కొట్టే వేగం ఉంది!
అతనికి ఇచ్చావు నువ్వు
విలాసవంతమైన జీవితం!
పర్యవసానం విషాదమైన అంతం!
నీ డబ్బుతో నీ కొడుకు
తాగుబోతై, తిరుగుబోతై
ఉన్మాది లా మారుతున్నా
నువ్వు మారవు!! వాడ్ని మార్చవు!!
ఎందరి ఉసురు పోసుకొని
ఎందరి కష్టం దోచుకొని
అంతస్తులు నిర్మించావో గానీ...
ఆ భారం నీ వంశం పునాదులునే
పగులదీస్తోందనే జ్ఞానం
నీకు కలగటం లేదు!
రేపటి తరానికి నేరపూరిత
వారసత్వాన్ని ఇచ్చే నీలాంటి
తండ్రులు, తాతలు
ఈ లోకానికి పట్టిన దుర్భాగ్యాలు!!
Comments
Post a Comment