లేఖా సాహిత్యం స్వతంత్రపోరాటం-1
జనవరి 20 1935
ప్రియమైన
కుమారునికి,
నీ స్వాతంత్య దీక్షా దక్షతలను చూసి తండ్రిగా నేను గర్విస్తున్నాను. మొక్కవోని మీ ఆత్మస్థైర్యం మనకు ఖచ్చితంగా స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెడుతుంది. మేమంతా ఎప్పటికప్పుడు
మీ పోరాట విషయాలను సేకరిస్తున్నాము. నీవూ మీ సమూహము జాగ్రత్తవహిస్తూ పోరాడండి. ఏ సహాయం కావాలన్నా ఇక్కడ మేము సిధ్ధంగా ఉన్నాము. అన్నివేళళా ఆయుధం సహకరించదు. ఒక్కోసారి మీ ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది.
తెల్లవారి అఘాయిత్యాలకు మనవాళ్ళు ఎందరో బలి అవుతున్నారు. దైవాన్ని నమ్ముకోండి. దైవబలమే మీకు వారిని ఎదిరించే శక్తినిస్తుంది. మన భారతీయులెవరైనా తెల్లదొరలవల్ల ఇబ్బంది పడుతుంటే మొదట వాళ్ళను రక్షించే ప్రయత్నం చెయ్యండి. మనకు ప్రజాబలం అవసరం. వీలైనంతవరకూ శాంతియుత పోరాటం చెయ్యండి. అవసరమైతే ఆయుధం పట్టడానికి వనుకాడకండి.
విశాఖపట్టణం లక్ష్యంగా ముందుకు కదలండి. అక్కడ మన్నె ప్రజలను బానిసలుగా హింసిస్తూ పనులుచేయిస్తున్నారు. పాడేరులో మన అనుయాయుడైన అప్పలదొర ఉన్నాడు. అతడిని వెళ్ళి కలవండి. అతను మీకు అన్నివిధాలుగా సహాయ పడతాడు. రైలు మార్గాలపై ఓ కన్ను వేసి ఉంచండి. ఆంగ్లేయుల బలమంతా రైలూ, నౌకా మార్గాలే. వాటిని దెబ్బ కొడితే వాళ్ళను అదుపు చెయ్యవచ్చు.
రాజమండ్రిలో మీ మామయ్య కొడుకు సత్యాగ్రహం చేస్తుండగా తెల్లకుక్కలు వచ్చి మీద పడి హింసించాయట. వాడిని విశాఖపట్టణం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని కబురు తెలిసింది.
నేను వచ్చేవారం విజయనగరం సంస్థానం వస్తాను. వీలైతే అక్కడ మనం కలవచ్చు. మీ అమ్మ, చెల్లీ నిన్ను ధైర్యంగా పోరాడమని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మహిళా ఉద్యమసంఘ కార్యకలాపాలలో ఉన్నారు.
మళ్ళీ కలుద్దాం
మీ తండ్రి
రామరాజు
Comments
Post a Comment