కలం కన్నీరు కారుస్తోంది

నా కలం కన్నీరు కారుస్తోంది!!
నా కలం కన్నీరు కారుస్తోంది!!

మనసులోని భావాలకు
అక్షర రూపమిస్తూ...
నిర్లక్ష్యానికి గురౌతాయేమోనని
నా కలం కన్నీరు కారుస్తోంది!!

ఆలోచనల పొరల్లోంచి
పూవుల్లా రాలిన పదాలు
ఎండి ఎగిరి పోతూవుంటే...
నిరుపయోగ  మౌతున్నాయని
నా కలం కన్నీరు కారుస్తోంది!!

గుండెలలో నుండి పుట్టిన ఆవేశం
అగ్ని కణంలా మారి
అక్షరాలను విస్ఫోటిస్తుంటే
ఆ శబ్ధం గ్రహించినా గ్రహించనట్లు
మసలే శిలలను చూసి
నా కలం కన్నీరు కారుస్తోంది!!

ప్రబంధాలు రాసే సమర్ధుడ్ని కాను!
నిఘంటువులు నింపుకున్న
మేథావినీ కాను!
మనసును కదిలిస్తే ...
కలాన్ని కదుపుతాను!
కడుపులో రగిన ఆవేశాన్ని
కలం నుండి కక్కేస్తాను!
కళ్ళల్లో ఇంకిన కన్నీళ్ళను
కలంకి ఇంకుగా ఎక్కిస్తాను!
తెలిసిన పదాలకే
తేనెను పూస్తాను!!
చదివిన వారి స్పందన
నా చెవులకు చేరకపోయినా...
నా కలం కార్చే కన్నీళ్ళకు
నేను అడ్డు కాను!!

ఎప్పటికైనా నా కలం
ఆనంద భాష్పాలను
రాల్చే క్షణం కోసం... ఎదురు చూస్తూ...
రాస్తూనే ఉంటాను!!
ఆత్మ సంఘర్షణే సాధనంగా!!
మనోబలమే భూషణంగా!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు