తేటగీతి పద్యాలు
మాత శారద వరమున మదిన మెదిలి
కవిత సాగర మధనంబు కలుగుచుండె
తెలుగు వ్రాసెద నికనేను తేటగీతి
మధుర భావము పలికింప మాట నిత్తు
ఘనుడు గానము నందున ఘంటశాల
నటన మందున శిఖరము నందమూరి
యతని సాటగు సహజుడు యక్కినేని
కలసి వెలిగించె తెలుగింట కాంతి జ్యోతి
గాన కోకిలగు సుశీల గాత్రమందు
మధుర సుధలెన్నొ చిందెను మంద్ర వీణ
బాలగంధర్వ భానుడు బాలు గళము
పాడి జీవించె వేవేల పాటలందు
సాగె నానాడు తెలుగున స్వర్ణయుగము
నిలిచె సాహిత్య సంగీత నిధులు మనకు
లెక్కమిక్కిలి మహనీయులొక్కటగుచు
తెలుగు సీమల నలరించె తేజముగను
నేడు కలగూర గంపాయె నేమి మనకు
సరస సంగీత మంతయు సవ్వడించి
చెవుల సాహిత్య మేపాటి చేరదాయె
మధుర గాత్రంబు విననీదు మచ్చుకైన
రక్త పాతమె జూపింతు రధికముగను
సత్వ భావము నింపరు సవ్యముగను
నేర పూరిత దుర్గంధ సారమాయె
కడకు నటసీమ కలుషిత కల్పమాయె
దేశ భవితను యాశించు నాశయముగ
నిలువ రావలె నెల్లరు నిగ్రహమున
ముప్పు మాదక ద్రవ్యము ముసలకమ్ము
జాగరూకత లేకున్న జటిల మగును
మనల దీటుగ నెదిరింప మశకమగుచు
పగఱు పాకులు పంజాబు పంచ జేరి
కుటిల నీతిన కలియుచు గుంతలిడుచు
మత్తు నందున దింపిరి మత్సరమున
తెగువ జూపగ మనమంత తెలివి కలిగి
దుష్ట రాజ్యపు దుర్బుధ్ధి దునిమి వైచి
సర్వ శక్తులు యొడ్డుచు సఖ్యమొంది
జాట వలయును మనశక్తి జగమునంత
Comments
Post a Comment