లేఖా సాహిత్యం - తండ్రి తనయునికి
లేఖా సాహిత్యం -తండ్రి తనయునికి -
తేదీ : జూలై 6, 1978
ప్రియమైన పుత్ర రత్నానికి,
మీ నాన్న ఆశీర్వదిస్తూ వ్రాయునది.
ఇక్కడ అంతా క్షేమం. అక్కడ నువ్వు క్షేమమని తలుస్తున్నాను. నిన్న రాత్రి మేము మాయాబజార్ సినిమాకి మన ఊరి దోమల హాలుకెళ్ళి చూసొచ్చాము.
వచ్చిన దగ్గర్నుండి మీ అమ్మ ఒకటే ఏడుపు. అభిమన్యుడు అక్కినేనిని చూసాక నువ్వే గుర్తొచ్చావుట.
అవునొరే నువ్వక్కడ జాగ్రత్తగా చదువుకుంటున్నావు కదా? ఏ శశిరేఖకో ఖాళీగా ఉందిగదాని మనసు పారేసు కోలేదు గదా? ఒరే! నువ్వలాంటి అఘాయత్యం చేస్తే మీ అమ్మకి గుండాపరేషను చేయించాల్సొస్తుంది. అది కాస్త గుటుక్కు మందనుకో ఇహ నేను కూడా చావాల్సిందే. ఆ తర్వాత నీ ఇష్టం. ఒక్కగానొక్క కొడుకువి. అదే నా బాధ. నలుగురు ఆడ పిల్లల తర్వాత పుట్టిన నలుసువి. ఒళ్ళు దగ్గర పెట్టుకునీ... ఆ చదువేదో పూర్తి చేసి... తిన్నగా ఇంటికిరా! పెద్దముండావాళ్ళం నీ పెళ్ళి సంగతి మాకొదిలేయ్! ఒక లకారానికి తక్కువ లేకుండా మంచి కట్నమిచ్చే సంబంధం చూసి పెళ్ళి చేస్తాం.... ఏమిటి అర్థమయ్యిందా... అయ్యే ఉంటుందిలే!
సరే గానీ గత వారం నువ్వొస్తావని మీ అమ్మ నీకోసం సున్నుండలు చేసి పెట్టింది. డబ్బా ఖాళీ అయిందనుకో... నీకు తెలుసుగా... అవంటే నాకు ప్రాణమని...ఒక్కటి మాత్రం మీ అమ్మ దాచి ఎక్కడో పెట్టింది. ఈ సారైనా వచ్చి తగలడు. తిందువు గాని.
మరి ఉంటా! మీ అమ్మ నిన్ను మరీ మరీ అడగమంది.
సమయం రాత్రి పదౌతోంది. సిలోన్ రేడియో వినాలి ఉంటాను.
ఇట్లు మీ
నాన్న
అవధానుల అప్పారావు
Comments
Post a Comment