నిషాచరుల నీడలు

పసివారి పండంటి భవితను
పిశాచాలు కబళిస్తుంటే
నిషాచరుల నీడలలో పడి
ఉషస్సునే కోల్పోతుంటే
ఉసురు తగిలి ఉసూరు మన్నది
జాతి ఇపుడు దోషము తెలిసి!

కళ్ళ ఎదుట కనబడు సత్యం
వళ్ళు మరచి వదిలేస్తుంటే...
ముష్కరులకు దుష్కర్ములకూ
కర్కశత్వ కఠినాత్ములకూ
నిట్టనిలువు నిచ్చెనలేసి
జరుగుతున్న జనహన ఘోరం
జతకళ్ళతొ చూస్తూఉంటే...
ఎక్కడుంది జాగృతి మనలో!
పిక్కటిల్లి ఏడ్వక మదిలో...
పక్కదారి పడుతున్నామే
మనకెందుకు మకిలి వద్దని!
మన ఇల్లే మనకు ముద్దని!

పొరుగు ఇంట పొగలు రేగితే
నీ ఇంటికి నిప్పు చేరదా!
విషనాగును వదిలేస్తుంటే
కడకు నిన్ను కాటు వేయదా!
ఓ మనిషీ మగతను విడుమా!
ఉప్పెనగా ఉరకలనిడుమా!
దుప్పటిగా ముసిరిన మబ్బుని
దులిపి దులిపి కాంతిని గనుమా!
చెఱకు తుదను వెన్నును తునుమా!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు