లేఖా సాహిత్యం - డ్రగ్స్ -1
తమ్ముడూ!
నిన్ను ఈ గదిలోనే ఉంచి బయటకు రానివ్వకుండా ఉంచటం నాకు ఇష్టంలేదు. మనం ఎంతో స్వేఛ్ఛగా ఆనందంగా తిరిగేవాళ్ళం. నాన్న మనకి ఆ స్వేచ్ఛ ఇచ్చారు. నేను ఆస్వేచ్ఛను బాగు పడటానికి ఉపయోగించుకుంటే నీవు చెడిపోవటానికి ఉపయోగించుకున్నావు. నీకు ఉన్న చపలత్వమే నిన్ను మాదకద్రవ్యాల ఊబిలోకి లాగింది. నిన్ను ధూమపానం నుండి బయటపడెయ్యటానికి నేను చేసిన ప్రయత్నం విఫలం చేసావు. నన్ను విడిచిపెట్టి చెడు స్నేహాలు పట్టి వేరే చోటికి వెళ్ళిపోయావు.
ఈ విషయం నేను నాన్నగారి చెప్పాను. ఆయన చాలా బాధ పడ్డారు. ఆయన నిన్ను మందలించడానికి హైదరాబాదు వచ్చారు. కానీ నువ్వు వారికి కనిపించకుండా తప్పించుకు తిరిగావు.
సంవత్సరం తర్వాత ఓ రోజు పోలీసులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. మేము వాళ్ళతో పాటూ స్టేషన్ కి వెళ్ళాము. అక్కడ సెల్ లో అపస్మారకంగా పడిఉన్న నిన్ను చూసి ఆశ్చర్యపోయాము.
పత్రికలలోనూ టి.వి లలోనూ నీ గురించిన వార్త ప్రసారం కాకుండా జాగ్రత్తపడ్డాం. నీవు డబ్బుకోసం చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టబడ్డావు. అది ఎంత పెద్ద నేరమో తెలుసా. నీ మీద కేసు పెట్టకుండా కోర్టుల చుట్టూ తిప్పకుండా ఉండటానికి కారణం ఎస్ఐ గారి మంచితనం. వారే నిన్ను ఈ రీహాబిటేషన్ సెంటర్లో చేర్పించారు.
నీ సెల్ ఫోన్ కాల్ డాటాను బట్టి నీలాంటి వాళ్ళను ఈ ఉచ్చులోకి లాగుతున్న ముఠాను అరెస్టు చేసారు.
వారి వద్ద అతి ప్రమాదకరమైన కొకైన్, బ్రౌన్ సుగర్, నికోటిన్ లాంటి కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టు బడ్డాయి.
నువ్వు ఇకనైనా మార్పు తెచ్చుకో. మంచి అలవాట్లు అలవరుచుకో. పదిమందికీ ఆదర్శంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉంటే అలవాట్లనుండి బయట పడవచ్చు.
ధూమపానం, మత్తు మందు, ఆల్కహాల్ సమాజానికే కాదు... నీకూ శతృవులే... శతృవును ఆశ్రయించడం చావును ఆశ్రయించడం రెండూ ఒక్కటే!
నువ్వు నీ శతృవుతో పోరాడి గెలవాలి గాని లొంగిపోకూడదు!!
నీ దేశాన్నీ, సాటి మనుషుల్నీ ప్రేమించు!
నీకోసం కాకుండా సమాజం కోసం బ్రతుకు!!
సమాజం కోసం బ్రతికితే నాకేమిటి లాభం అని ప్రశ్నించకు. నీకోసం బ్రతికితే ఏమయ్యావో చూశావం గదా! ఇప్పుడు సమాజం కోసం బ్రతికి చూడు.
సమాజంకోసం బ్రతికినవాడు, సేవలందించేవాడూ శాశ్వత కీర్తిని పొందుతారు. తమ కోసమే బ్రతికి బ్రష్టులైనవారు. ఎండుటాకుల్లా ఎగిరిపోతారు!!
నీ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకూ నువ్వు ఈ గదిలో ఉండక తప్పదు. గొంగళి పురుగు ప్యూపా దశ నుండి రంగుల సీతాకోక చిలుకలా మారి ఎలా ఎగురుతుందో... అలా నువ్వు మారి నా తమ్ముడివై తిరిగి వస్తావని... నీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము.
ఆరోగ్యంగా మనోబలంతో తిరిగి రా!!
ఉంటాను
నీ అన్నయ్య
Comments
Post a Comment