దేవుడికి లేఖ
దేవుడా!!!!
నేను సామాన్యుడను. నిన్ను ఏ పేరుతో పిలవాలో తెలీక దేవుడా అని పిలిచేను. అన్ని పేర్లు నీవేనటగా... అందుకే!
ఈ లేఖ నీకు రాయటానికి కారణం... ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగాలేవు. అందరూ నిన్ను నమ్మినట్లే కనిపిస్తారు... కానీ... మనుషుల్లా ప్రవర్తించరు. ఒకరిపై ఒకరికి ధ్వేషం... మతాల ముసుగు నీపై వేసి అల్లకల్లోలం చేస్తున్నారు. అడ్డుపడితే అరాచకమే.
స్త్రీలకు లక్ష్మీ కళ రాను రాను తగ్గి పోతోంది. పురుషుల మాట ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దైవ చింతన మాట అటుంచు. పాప చింతన కూడా లేదు. పబ్బులూ క్లబ్బులూ అంటూ పెడదారి పడుతున్నారు.
ఆలయాలు ఫనాన్స్ కంపెనీల్లా రేట్లు పెట్టేసాయి. దర్శనానికి ఒక రేటు, అర్చనకొక రేటు, అభిషేకానికి ఒకరేటు... ఇలా పవళింపు సేవ వరకూ చెప్పుకుపోతే లిస్టు చేంతాడంత అవుతుంది.
ఈ మధ్య నీకు కాంపిటేషన్ కూడా పెరిగిపోయింది. ఆధ్యాత్మిక ముసుగులో దోచేయ్యడానికి... భగవాన్లు, బాబాలు, గరువులు... ఎవరికి వారే వాళ్ళ దుకాణాలు తెరిచేసి దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత మహదేవా అని అడ్డూ అదుపూ లేకుండా దోచుకుంటున్నారు.
ఇక వీళ్ళను చూబించి అసలు నువ్వేలేవంటూ ఖండించేస్తున్నారు నాస్తికులు. అసలు నువ్వున్నావా??
ఉంటే ఎందుకు బుధ్ధచెప్పవు ఈ మోసగాళ్ళకి, ఎందుకు ఆపవు అత్యాచారాలను? ఎప్పుడో కౌరవ సభలో ద్రౌపదికి చీరలిచ్చి రక్షించావని ఇప్పటికీ చెప్పుకుంటున్నాము. మరి ఇప్పుడు రావేం?? ఇక్కడ ప్రతి సందూ ఒక కౌరవ సభగా మారిపోతోంది.
ఈ మధ్య ఐఎస్ ఐఎస్ అనే సంస్థ ప్రపంచమంతటా ఉగ్రభూతంలా విస్తరించింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నావుగా. ఇప్పుడు రా!!!
అందుకే ఈ ఉత్తరం నీకు వ్రాస్తున్నాను. అందిన వెంటనే బయల్దేరు.
నీ అడ్రస్ నాకు తెలీదు. అందుకే దేముడి హుండీలో వేస్తున్నాను. ఇందులో వేసేవన్నీ నీకే చెందుతాయట గాదా... అదే నమ్మకంతో వేస్తున్నాను. త్వరగా వచ్చి చక్కదిద్దు.
ఇట్లు
నీ సామాన్య భక్తుడు.
Comments
Post a Comment