లేఖాసాహిత్యం స్వతంత్ర పోరాటం 2
జనవరి 25, 1935
నాన్నగారికి,
చిత్తరంజన్ ద్వారా మీ ఉత్తరం ఈ రోజే అందుకున్నాను. మీ సహకారానికి ధన్యుడను. ఇక్కడ మా స్వతంత్ర ఉద్యమం తీవ్రతరం చేసాము. తెల్లవారి దమననీతిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాము. మా ఉద్యమంలో ఎందరో మహా కవులు ఉత్తేజభరితమైన గీతాలు వ్రాస్తూ, మాకు ఊపిరులందిస్తున్నారు.
ఈ ఉద్యమ ఫలాలు మన భావితరాలకు అందాలన్నదే మా ప్రగాఢ వాంఛ. భరతభూమి దాశ్య శృంఖలాలను ఛేదించుకుని, నీతి నిజాయితీలే ఆయువుగా, ధర్మమే మార్గంగా స్వపరిపాలన చేసేందుకు మార్గం పడాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో మేము అశువులు బాసినా మాకు సంతోషమే.
గాంధేయ వాదులు ఒకవైపు, పోరాట వాదులు ఒకవైపు. మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే... స్వాతంత్ర్యం!!
మేమిప్పుడు శృంగవరపు కోట నుండి కాలి నడకన విశాఖపట్టణం వైపు వెళ్తున్నాము.
మాకు ప్రజలనుండి మంచి సహకారం లభిస్తోంది. ఎందరో స్వఛ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. మన్నె ప్రాంతాలలో ఆంగ్లేయుల పాలనా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాము. విశాఖ ఓడరేవు ద్వారా వారు ఎంతో విలువైన అటవీ సంపదను తమదేశానికి తరలిస్తున్నారు. ఇది సాగనివ్వం. మన గిరిజనులను హింసిస్తూ వారి ప్రయాణాలకు మార్గాలు వేయిస్తున్నారు. అనేక చోట్ల వారిని అడ్డుకుని విజయం సాధించాము.
మాలో డాక్టర్ విలాసరావు వంటి ప్రముఖులు ఉండి క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు.
మనలో కొందరు భారతీయులు ఉదర పోషణార్ధం తెల్లవారితో చేతులు కలిపి మన ఉద్యమానికి తీవ్ర నష్టం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప దేశభక్తులను మనం పోగొట్టుకున్నాం. ఆ మహానుభావుడు పరమపదించి పదేళ్ళవుతున్నా పోరాట వేడి మాత్రం చల్లారకుండా స్ఫూర్తి నింపాడు.
రెండవ ప్రపంచ యుద్ధం త్వరలో రాబోతోంది. అదే మనకు మంచి అవకాశంగా భావిస్తున్నాము. బ్రిటిష్ ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టపోయి మనకు మన దేశాన్ని విడిచి పెట్టక తప్పదు. కానీ ఈ లోపు ఎందరు దేశభక్తులు ప్రాణాలు విడిచి భరతమాత ఒడిలో శాశ్వత నిద్ర చేస్తారో చెప్పటం కష్టం.
అంతిమ విజయం లభించే వరకూ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంటాం!!
ఉంటాను
మీ కుమారుడు భరత్
జై భారతమాత!!
Comments
Post a Comment