లేఖా సాహిత్యం 2 - తనయుడు తండ్రికి
తేదీ: జూలై 16 1978
ప్రియమైన పూజనీయులైన నాన్న గారికి, మీ కుమారుడు వరప్రసాదు వ్రాయునది... ఇక్కడ నేను క్షేమం అక్కడ మీరు క్షేమమని తలుస్తాను.
మీరు ఆరో తారీఖున వ్రాసిన ఉత్తరం ఈ రోజే అందింది. సంగతులు తెలిసినవి.
నేను గతవారం మీతో మాట్లాడేందుకు మన వీధి చివర కడగంటి వారింటికి ఫోన్ చేసాను. ఆయన మడిలో ఉన్నాను ఇప్పుడు పిలవడం కుదరదన్నాడు. ఇక బాగోదని మళ్ళా ఫోన్ చెయ్యలేదు.
నిన్ననే ఓ ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను.
వివిధ భారతిలో మంచి పాటలు వస్తున్నాయి. ప్రొద్దుటే వెంకటేశ్వర సుప్రభాతంతో నా రోజు మొదలౌతోంది.
ఉదయం టిఫిన్ చేసుకోటానికి టైము ఉండదు. మూడు లాంతర్ల జంక్షన్లో దేవీ విలాస్ హోటల్ కెళ్ళి సాంబార్ ఇడ్లీ తిని ట్యూషన్ కి బయలుదేరతాను.
నేను ఇంగ్లీషులో వెనకబడుతున్నానని ఈ మధ్యనే వెళ్ళి నేర్చుకుంటున్నాను. తెలుగు, సంస్కృతం నువ్వు బాగా నేర్పడం వల్ల కవితలూ పద్యాలు బాగా వ్రాయ గలుగుతున్నాను. నిన్న గురజాడ అప్పారావు సాహిత్య కళా పరిషత్ వారు నిర్వహించిన పద్యాల పోటీలో నాకు ప్రధమ బహుమతి వచ్చింది.
నా డిగ్రీ చదువు మరో సంవత్సరంలో పూర్తి అవుతుంది. బి.యి.డి చదివి ఉద్యోగం సంపాదించాకే పెళ్ళి. అంతవరకూ ఆ ప్రయత్నాలు చెయ్యకండి. ఆ పైడితల్లి అమ్మవారి దయవల్ల నాకు మంచి గురువులు దొరికారు. ఈ మధ్య మహరాజా కళాశాలలో సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. ఈ సారి వచ్చినప్పుడు పాడి వినిపిస్తాను.
ఇక్కడ సింహాచల దేవస్థానం వారి సత్రంలో ఉచిత భోజనం ఉంటుంది. ధరకాస్తు పెట్టుకున్నాను.
నా కోసం అమ్మని బెంగ పడవద్దని చెప్పు. ఉంటాను.
నీ ప్రయమైన కుమారుడు
వర ప్రసాదు
Comments
Post a Comment