కవితా కౌశలం
సంభాషణ సడలిస్తూ వ్రాసి
వ్యాసాలను పద పంక్తుల జెప్పి
గేయ కవిత్వం రూపం మార్చి
వచన కపిత్వం కవిత్వమంటూ...
చదివేవారే చదివెదరంటూ...
మెచ్చెడి వారే మెచ్చెదరంటూ...
నిన్ను నీవు సరిపెట్టుకు పోతే...
నీదే నష్టం! నీకే కష్టం!
శిలకు రూపమె చెక్కకపోతే
శిల్పం ఎట్లా అవుతుంది!
శృతిలయ రాగం లేకుంటే
అది గానం ఎట్లా అవుతుంది!
పద్యలక్షణం గద్యలక్షణం
గీత లక్షణం గేయ లక్షణం
ఏ లక్షణమూ సరిపోలకనే
వ్రాసే వాక్యం కవిత్వమవ్వదు!
భాష భావం కవి సందేశం
హృదయపు గదులను తాకనినాడు... ప్రయత్నమెందుకు! ప్రయాసమెందుకు!
కలుపుమొక్కలుగ పెంచటమెందుకు!
కలం కదిపితే కవిత్వమవనీ!
కుంచెను దులిపితె చిత్రం కానీ!
గొంతున పాడితె శ్రావ్యం కానీ!
పిచ్చి మాటలకు, పిచ్చిగీతలకు
పిచ్చి పాటలకు పందిరివేస్తే...
కళావైభవం కాబోదోయ్ అది
కళాసౌరభం కానీదోయ్!!
Comments
Post a Comment