లేఖా సాహిత్యం - డ్రగ్స్
నాన్న గారూ,
మీరు నాకు మనస్సును ధృడంగా ఎలా ఉంచుకోవచ్చో నేర్పారు. నేను ఇంజనీరింగ్ చదవడానికి ఇప్పుడు మీకు దూరంగా హైదరాబాదు వచ్చానని నా మనసు కంట్రోల్ తప్పుతుందేమోనని భయపడకండి.
నేను స్నేహితుల విషయంలో జాగ్రత్త ఉంటున్నాను. ఈ మధ్య కొందరు నాకు సిగరెట్, పాన్, తాగుడు వంటి అలవాట్లు లేకపోవడం చూసి ఎగతాళి చేసారు. ఇంకెందుకు బ్రతకడం అంటూ నవ్వారు. వాళ్ళకి నేను తగిన సమాధానం చెప్పాను. "మీరు నన్ను ఎగతాళి చెయ్యడం సరే. రేపు మీ అలవాట్లు మీ జీవితాన్ని ఎగతాళి పాలు చెయ్యకుండా జాగ్రత్త పడండని"
ఆ మధ్య ఒక సీనియర్ స్టూడెంట్ నన్ను రాగింగ్ చేయ ప్రయత్నించాడు. నేను అతనికి గట్టిగా బుధ్ధి చెప్పాను. "నువ్వు నన్ను రాగింగ్ చేసే ఘనుడవు కావు. ముందు నీ దురలవాట్లు నిన్ను ఆటపట్టిస్తున్నాయి వాటి సంగతి చూసుకో అని"
అతడు కొంతకాలంగా డ్రగ్స్ సేవిస్తున్నాడు. నేను అతడికి తెలియకుండా వెంబడించి అతడు ఎవరి దగ్గర డ్రగ్స్ కొంటున్నాడో ఏఏ ప్రదేశాలకి వెళ్తున్నాడో వీడియో తీసి వారి పేరెంట్స్ కి పంపాను. వాళ్ళు అంతా తెలుసుకుని అతడ్ని బాగుచేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాదు నేను సేకరించిన విషయాలను మాదకద్రవ్యాల నిఘా సంస్థలకు కూడా పంపాను. వారు నన్ను చాలా అభినందించారు. ఇలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తే... నేరాల సంఖ్య తగ్గించ వచ్చని నా బాధ్యతను మెచ్చుకున్నారు.
ఇప్పుడు నేను డ్రగ్స్ ముఠాలు మా కాలేజీ ఆవరణలోకి రాకుండా ఆపగలిగాను. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయించడం ద్వారా అది సాధ్యమయ్యింది.
అంతేకాదు. మా కాలేజీ పరిసరాలలో ఎక్కడ అలాంటి వాళ్ళు తారసపడినా పట్టించేందుకు ఒక గ్రూపును తయారు చేసుకున్నాము.
ఇప్పటికి పదిమందిని అరెస్టు చేయించాము. మరో విషయమేమంటే కాలేజీ లోపలా బయటా కూడా మా గ్రూపు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలూ సమావేశాల ద్వారా డ్రగ్ వాడకాన్ని అరికట్టేందుకు పనిచేస్తున్నాము. చదువుతో పాటూ సమాజ బాధ్యత కూడా నేటి తరాలకు ఉండాలని వివిధ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నాము. ఇందుకు కాలేజీ యాజమాన్యం కూడా మాతో సహకరిస్తోంది.
మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాను.
ఉంటాను.
మీ
కుమార్
Comments
Post a Comment