జీవునిలోని జీవము నీవై

జీవునిలోని జీవము నీవై
తీరుగనుంటివి సదాశివా!
దేహములోని దేహిని నిల్పి
లీలలు జేతువు మహాశివా!
మాయని తెలిసిన మారగలేము
మాకిది వరమే మనఃశ్శివా!

కారణమెరుగని యానమె లేదని
శివయానతి గొని నడుచును విధియని
ఎరిగితి నయ్యా! నీ కధ విని నే!
నమ్మితి నయ్యా! నిను మది తలచీ!
ధ్యానము నొందితి...! సాధన జేసితి!  మార్గము జూపుము యోగేశ్వరా!

జీవునిలోనీ జీవము నీవై
తీరుగనుంటివి సదాశివా!

వాయు లింగమై గళమున నుందువు!
అగ్ని లింగమై ఉదరమునుందువు!
ఆత్మ లింగమై హృదయమునుందువు!
జ్ఞాన లింగమై నొసటన యుందువు!
సూక్ష్మ లింగమై... అణువణువందున
కొలువై యుందువు సర్వేశ్వరా!

జీవునిలోనీ జీవము నీవై
తీరుగనుంటివి సదాశివా!
దేహములోని దేహిని నిల్పి
లీలలు జేతువు మహాశివా!
మాయని తెలిసిన మారగలేము
మాకిది వరమే మనఃశ్శివా!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు