చెలిమి వల
స్వేత హంసలా
ఆమె నడచి వెళ్తోంది
మెరుపుల కాంతులు
ఆమె మేని అందాలను తాకి
ప్రతిబింబిస్తున్నాయి
నిస్సందేహంగా...
ఆమె సౌందర్య రాశియే!
ఆమెను చూసిన కనులు
సూటిగా ఆమె వంకే
నిలబడుతున్నాయి
ఆరాధనతో కాదు...
ఆక్రమించాలన్న వాంఛతో!
ఆమె నడచి వెళ్తుంటే
చూపరుల కళ్ళు
ఆమె అడుగుల వెంటే
పరుగు తీస్తున్నాయి!
కలసి నడవాలని కాదు...
అల్లుకుపోవాలనే కోర్కెతో!
ఆమె చూపులు నవ్వుతున్నాయి!
చూపరుల తపన చూసి...
ఆమె మరింత హొయలుగా...
గర్వంగా నడుస్తోంది!
నెమలిలా... జాణలా...
ఆమెకు తెలియనిదల్లా ఒక్కటే
ఆమె స్పర్శ కోసం తహతహలాడే
పురుష పుంగవులు...
చెలిమి వల పన్నుతున్నారని!
లేడి కళ్ళ ఆ సుందరికి తెలియదు
తను పులుల మధ్య నడుస్తున్నానని!
వగలొలికే ఆ వన్నెలాడికి తలియదు
తను వేటగాళ్ళకు చిక్కబోతున్న
నెమలినని...!!
అందం అతివల సొంతమే అయినా
అది ఆరాధించేదిగా ఉండాలని
గౌరవప్రదంగా ఉండాలని
ఔన్నత్యాన్ని పెంచేదిగా ఉండాలని
ఆపి... చెప్పాలనుకున్నాను!
కానీ... అంతలోనే వెళ్ళిపోయింది
చెలిమి వలలోనికి...!!
Comments
Post a Comment