ప్రకృతిముందు తలవంచు
పెరిగే ఉష్ణం సాక్షిగా
కరిగే ధృవాల సాక్షిగా
ఉరికే సంద్రం సాక్షిగా
పగిలే కొండల సాక్షిగా
తరిగే అడవుల సాక్షిగా
కురవని మేఘం సాక్షిగా
ఎండిన నదుల సాక్షిగా
పూడ్చబడిన చెరువుల సాక్షిగా
నెర్రలీనిన నేల సాక్షిగా
మనిషీ ఇది నీ దురాగతం!!
ప్రగతి కోసం ప్రకృతితో
నీవాడుతున్న చెలగాటం!!
ఖనిజాలకోసం భూమిని
కలప కోసం అడవులని
నగర విస్తరణ కోసం కొండల్ని
నాశనం చేస్తున్న నీ పాపం
ప్రాణకోటిని అంతం చేయకముందే
ప్రళయ భీభత్సం జరగక ముందే
విజ్ఞతను ప్రదర్శించు!!
ఉద్గారాలను తగ్గించు!!
చెట్లను పెంచు!!
అడవులను రక్షించు!!
చెరువులు తవ్వించు!!
కనిపిస్తున్న సంకేతాల సాక్షిగా
నువ్వు మారాలని గ్రహించు!!
పర్యావరణ సమతౌల్యం
సాధించాలని గ్రహించు!!
ప్రకృతి ముందు తలవంచు!!
Comments
Post a Comment