తెలుగు బాల్య గీతాలు
మీ పిల్లలకు మా చిన్నతనంలో చదువుకున్న, ఆడుకున్న, పాడుకున్న, నేర్చుకున్న ఈ పాటలని పరిచయం చేయండి. మీ కోసం, మన కోసం మరో సారి..... ఎంతమందికి గుర్తుకున్నాయి
ఈ పాటలు ?
** ** ** ** **
చిట్టి చిలకమ్మా - అమ్మ కొట్టిందా
తోటకెల్లావా - పండు తెచ్చావా
గూట్లో పెట్టావా - గుటుక్కున మింగావా
** ** ** ** **
చెమ్మ చెక్క – చేరడేసి మొగ్గ
అట్లు పోయంగా – ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క – ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మ చెక్క – రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క – పందిరెయ్యంగ
పందిట్లో మా బావ – పెళ్ళి చెయ్యంగ
సుబ్బారాయుడు పెండ్లి – చూచి వద్దాం రండి
మా వాళ్ళింట్లో పెండ్లి – మళ్ళి వద్దాం రండి.
** ** ** ** **
ఒప్పులకుప్పా – ఒయ్యారి భామా
సన్నా బియ్యం - చాయపప్పు
భావిలో కప్పా – చేతిలో చిప్పా
రోట్లో తవుడు – నీ మొగుడెవరు ?
గూట్లో రూపాయ్ – నీ మొగుడు సిపాయ్.
** ** ** ** ** **
చేత వెన్న ముద్ద – చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
సందిట తాయత్తులు – సిరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను – చేరి కొలుతు.
** ** ** ** **
చుక్ చుక్ రైలు
చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగి నాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయ్ తినిపిస్తా
చల్లని పాలు తాగిస్తా
** ** ** ** **
బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీధీ వీధీ తిప్పేరు
వీసెడు గంధం పూసేరు
పట్టే మంచం వేసేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులుక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
** ** ** ** **
బుజ్జి మేక బుజ్జి మేక ఎడకేల్తివి?
రాజు గారి తోటలోన మేత కెల్తినీ
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పుల చెట్లు మేసివస్తినీ
మేసివస్తే నిన్ను భటులు ఏమిచేసిరి?
భటులు వచ్చి నా కాళ్ళు విరుగగొట్టిరీ
కాలు విరిగిన నీవు ఊరకుంటివా ?
మందుకోసం నేను డాక్టరింటికేల్తినీ
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివీ?
చిక్కనైన తెల్ల పాలు అందిస్తినీ
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమాని కేమిస్తావూ?
గడ్డి తినక ఒకపూట పస్తులుండి తిరుస్తా.
పస్తులుంటే నీకు నీరసం రాదా?
పాడు పని చేయనింక బుద్దివచ్చేనాకు.
** ** ** * * **
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవె
చందమామ రావే జాబిల్లి రావే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
పైడి గిన్నెలో పాలబువ్వ తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే
తెల్ల మబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెల పానకాలు తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే.
** ** ** ** **
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింట కాపురము చెయనన్నది
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెమోగ్గె ముడవనన్నది
మొగుని చేత మొట్టకాయ తింటనన్నది.
** ** ** ** **
ఏనుగమ్మ! ఏనుగు! నాలుగుకాళ్ళ ఏనుగు
ఏ ఊరొచ్చింది ఏనుగు ? మా ఊరొచ్చింది ఏనుగు
ఏం చేసింది ఏనుగు? నీళ్ళు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన - ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు – ఎంతో చక్కని దేవుడు
** ** ** ** **
బావ బావ పన్నీరు - బావని పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు - వీసెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు - చప్పిడి గుద్దులు గుద్దేరు
కాళ్ళపీట వేసేరు - కడుపులో గుద్దులు గుద్దేరు
పట్టేమంచం వేసేరు - పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు - నూరు గుద్దులు గుద్దేరు
** ** ** ** **
ఆదివారం నాడు అరటి మొలచినది
సోమవారం నాడు సుడి వేసి పెరిగినది
మంగళవారం నాడు మారాకు తొడిగినది
బుధవారం నాడు పొట్టి గెల వేసినది
గురువారం నాడు గుబురులో దాగినది
శుక్రవారం నాడు దాగినది పండినది
శనివారం నాడు చకచకా గెల కోసి
అందరికి పంచితిమి అరటి అత్తములు he
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో
Comments
Post a Comment