మా భువిని కాపాడ తరలి రారండి

ధరణి వీడితివేమొ ---
ధర్మమా నీవు!
నేల వీడితివేమొ ---
న్యాయమా నీవు!
భువిన నలిగినావు ---
శాంతమా నీవు!
దైవమే దిగివచ్చి
రక్షించె మిమ్ము!
శ్రీ హరుని రూపమున
యుగయుగమునందు!

తాను నాటిన ధర్మ
శాంతివనమంతనూ
మత దమనకాండకు
దహనమవుచుండెను!

కౄరాత్ములందరూ
బల గర్వములతోడ
బడబాగ్ని జ్వాలలను
రగిలించుచుండెను!

భూమాత మరల నువు
కోరవా మాధవుని!
కలియుగపు రక్కసుల
దునుమాడ రమ్మని!

పరమశివుడా నీవు
పంపవా హనుమని!
ఉగ్రమూకలనెల్ల
పరిమార్చి రమ్మని!

సప్త ఋషులందరూ
ఏకమైరండి!
ఇంద్రాది దేవతలు
ఒక్కటై రండి!

మా భువిని కాపాడ
తరలి రారండి!!
మా భువిని కాపాడ
తరలి రారండి!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు