దేముని వేదన
నేను దేముడ్ని!
ఈ శిలలో నన్ను ఆవాహన చేసి
భక్తులకు దీవెన లీయమన్నారు!
వేలాదిగా వస్తున్న భక్తులను
ఈ శిల నుండి దీవిస్తున్నాను!
ఈ అర్చక స్వాములు
అభిషేకాల పేరుతో
నిత్యం నన్ను తడిపుతున్నారు!
శపించాలన్నంత కోపం వస్తుంది!
అయినా వాళ్ళ తప్పకాదు!
ఆలయ శాశన మండలి నిర్ణయం!
నన్ను అలా గంటకు ఒకసారి
తడుపుతూ ఉంటేనే డిమాండ్!
తడిసిన ఆ శిలలో ఉన్న నేను
ఎవరిని ఎందుకు దీవించాలో
అర్థం కాదు! అది నా విధి కాదు!
పాపాలు చేస్తూ...
దేవుడా రక్షించు అంటే నేనేంచేసేది!
కర్మ ఫలితాలను తప్పించడం
సృష్టి ధర్మాన్ని అతిక్రమించడం
నేను చెయ్యలేని పని అని
అవతారాలు ఎత్తి మరీ చెప్పాను!
అయినా వినరేం...!
తరలి వస్తున్న ఈ జనంలో
ఒకరో ఇద్దరో భక్తులు ఉంటే
వారికే ఫలిస్తాయి నా దీవెనలు!
ఇతరులకు ఫలించక పోతే
నింద నాపై వేస్తారు!
వారు కోర్కెల భారంతో వస్తారేగానీ
నిష్కామ చిత్తులై రారు!!
నా పై విశ్వాసం పోతే...
కొందరు మతం మారిపోతారు!!
అన్ని రూపాలూ నావే...
అంతటా నేనే అన్న సత్యాన్ని
విస్మరించి మత మౌఢ్యులౌతారు!!
శిలలోనే కాదు!
ప్రతి జీవకణం లోనూ...
ఉంటాను నేను!!
మీ పాప ఫలితాల
తడి నాకు అంటకుండా!!
Comments
Post a Comment