ఊరు మారింది
చెప్పలేని ఉత్కంఠంతో
మనసు ఆగిపోయింది.
సుడులు తిరిగే ఆలోచనలు
ఆవిరైపోయాయి.
నేను చేరబోతున్న నా గమ్యం
చేరువౌతున్న ఆ క్షణం
ఒక యుగంలా నాకనిపిస్తోంది!
చల్లని పిల్లగాలి తెమ్మెర...
వాన తడికి తడిసిన మట్టి వాసన...
సందేహం లేదు!
ఇదే నేను ఇన్నాళ్ళగా చేరాలని
కలలు గన్న నాఊరు!!
ఇక్కడ ఒక చెరువుండాలి
ఏమయ్యిందో..!
నేనాడుకునే ఊడల మర్రి
ఏమయ్యిందో..!
పూరి పాకలు, తాడిచెట్లు
ఏమయ్యాయో...!
హా... ఆ కోవెల అలాగే ఉంది!
కోవెల ప్రక్క బడిమాత్రం లేదు!
జట్కాలు సైకిల్ రిక్షాలూ లేవు!
ఆ పొలాలు ఉండే చోట
ఏదో ఫ్యాక్టరీ వచ్చిందే!
హబ్బ! ఎలా ఉంటున్నారు వీళ్ళు!!
భరించలేని ఘాటు!!
నా చర్మం కందిపోతోంది!!
ఇది నా అందమైన ఊరు కాదు!!
ఇక్కడ నా బాల్యపు ఛాయలు
రవంత కూడా లేవు!!
నా కలల నేల జీవకళ తప్పింది!!
మారిన కాలంలో
సహజత్వం నశించింది!!
ఇందుకోసమేనా నేను తపించింది!!
ఆత్మీయతలూ, అమాయకతలూ
ఎవ్వరిలోనూ లేవు!!
కదులుతున్న యంత్రాలా !!
మనుషులా!! ఎలా మారింది ఇలా!!
కాలం ఇంత మార్చెస్తుందా!!
లేదు!! లేదు!!
మనుషులే కాలాన్ని మార్చేసారు!!
ఔను మనుషులే కాలాన్ని మార్చారు!!
Comments
Post a Comment