అన్న ప్రాసన

లేలేత చేతి వ్రేళ్ళతో
తల్లిని తాకుతూ...
తొలి స్పర్శ లోని ఆనందం
అనుభవించే పసిపాప

తొలి క్షీరాన్న స్పర్శ తో
మొదలైన మధురిమకు
చిన్ని మూతిని నాలుకతో
తడుపుకుంటూ...
నాకించిన ప్రతీసారీ
చప్పరిస్తూ సాగే ఆ ముచ్చట!

కళ్ళ ఎదురుగా...
ఆకర్షణగా కనిపించే వస్తువులు
కలాన్ని తాకుతుందా...
కరెన్సీని తాకుతుందా...
బంగారాన్ని తాకుతుందా...
బంతి పూలను తాకుతుందా...

కొన్న క్షణాల ఉత్కంఠం పిదప
కలాన్ని తాకిన పాపను చూసి
మురిసిపోయే తల్లిదండృలు...
కరెన్సీని తాకక పోతేనేం
మనమే తాకించెద్దామని
ఉబలాటపడే తాతా మామ్మలు...
నవ్వుల పువ్వులతో జరిగే ముచ్చట!

ఆ ముచ్చటను వీడియోలో
బంధించి పెట్టే బాబాయిలు...

అందరి స్పర్శలతో కందిన
ఆ చిన్ని బుగ్గలకు
వెన్న పూసి, దిష్టి తీసి...
ఊయలలో బజ్జుండ పెట్టడంతో
ముగుస్తుంది అన్న ప్రాసన!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు