కర్షక లోకం శపిస్తు ఉన్నది

మరిగే రక్తం!
మరిగే రక్తం!
మరణ మృదంగం వాయిస్తున్నది!

వగచిన హృదయం!
వగచిన హృదయం!
వరుణ వాహినై ప్రవహిస్తున్నది!

కణ కణ కణ మని కాగే నీరు!
కన్నుల వెంబడి స్రవిస్తుఉన్నది!

భగ భగ భగ మని మండే ఉదరం
బడబాగ్నులనే మింగేస్తున్నది!

అరిగే చెప్పుల చిరిగే దుస్తుల
విరిగే కర్రల లెక్కలు విడిచి
పిడికిలి బిగిసి అదటున ఎగసి
అలసత్వాలను గర్హిస్తున్నది!

పలుగులు పట్టి! పారలు ఎత్తి!
పొలాలనన్నీ హలాన దున్ని!
నెత్తురు చెమటా తడిసిన నేలన
ఒత్తిళ్ళున్నా విత్తులు జల్లీ
చేతికి వచ్చిన పంటను పట్టుకు
పట్నం వెళ్తే వచ్చిందేమిటి?

వచ్చిందేమిటి? వచ్చిందేమిటి?
తీరని నష్టం! తీరని నష్టం!
తీర్చగ లేని ఋణాల కష్టం!
ఓర్చగ లేని శవాల కాష్టం!!

ఇదేమి తీరని ప్రశ్నిస్తున్నది!
కర్షక లోకం శపిస్తు ఉన్నది!!
కర్షక లోకం శపిస్తు ఉన్నది!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు