అనుభవ సారం
నిస్పృహ నన్ను ఆవరిస్తున్నప్పడు
నిటారుగా నిలబడతాను!
ఆశలు నాలో ఆవిరి అవుతున్నప్పడు
నిరాశపై వర్షిస్తాను!
నా దారిన గోతులు పూడ్చేందుకు
నిరంతరం శ్రమిస్తాను!
విమర్శలు నాకు ఎదురైనప్పుడు
విశ్రమించి యోచిస్తాను!
గండశిలలై ఉన్న సమస్యలను
శిల్పాలుగా మలుస్తాను!
చేదుతో నయమయ్యే
రోగాలూ ఉంటాయి!
తీపితో వికటించే
వ్యాధులూ ఉంటాయి!
జీవితాన్ని పండించేందుకు
చేసే వ్యవసాయంలో
తీపీ చేదులకు అతీతంగా
సేద్యం చేస్తాను!
పండిన ఆ ఫలితాన్ని
అందరికీ పంచుతాను!
అనుభవాల సారం ఎపుడూ
నిస్సారం కాదు కదా...!
Comments
Post a Comment