బిచ్చగాళ్ళు

ఎటు వెళ్ళినా ఎచటాగినా
యాచించే చేయి!
నడవలేని నిస్సత్తువలో
భారంగా అడుగులు వేస్తూ...
దీనంగా చూస్తూ...
కళ్ళల్లో ఆశ...
నొసటను నిరాశ...
ఇచ్చేదెవరో ఇవ్వనిదెవరో...
అభిమానం చంపుకుంటూ
అడిగే ఆచేతిలో...
రూపాయి వేసినా పదినోటు వేసినా
ఒకటే నిర్లిప్తత!

గతమేదో తెలియదు గానీ
వార్ధక్యం బరువయింది వీరికి!
పని చేయలేరు - పరువుగా బ్రతకలేరు!
చెట్టు నీడలూ - కోవెల మెట్లు
బాట కూడళ్ళు - బస్సు స్టాపులు
చెప్పుకుపోతే చేంతాడంత!

ఒకరితో ఒకరు పోటీ పడుతూ...
ఎండా వానా లెక్క చేయరు
జన స్రవంతిలోనే ఉంటున్నా
జనాభా లెక్కకు దొరకరు!
సంక్షేమ పధకాలెన్నా...
వాటిని అందుకునే భాగ్యులు కారు!
భరతమాత ముద్దు బిడ్డలమని
చెప్పుకునే యోగ్యులు కారు!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు