అస్తిత్వం కావాలి

స్త్రీ సౌందర్య రాశి!
ఇది కాదనలేని సత్యం!
పురుషుడూ సుందరాంగుడే!
ఇది ఖండించలేని సత్యం!

స్త్రీ పురుషుల నడుమ
పరస్పర ఆకర్షణ
పరమాత్ముడు పంచిన
ధర్మమే అయినా...

తరతరాలుగా ‌పడతి
సొంపులె అందమని
యుగయుగాలుగా ఆమె
నబలగా ఉండమని

కవులు వర్ణిస్తారు
నఖశిఖ పర్యంతమూ!
శిల్పి చెక్కతాడు
అంగాంగ భంగిమలు!

తైల వర్ణాలలో రేఖ చిత్రాలలో
ఆకర్షణీయంగ గీసి చూపిస్తారు
ఊహలను తేలుతూ
బహు చిత్రకారులు !

వ్యాపార లాభాల ధృక్కోణ
కేళిలో తెరిచి చూపిస్తారు
వనిత పరువాలను!!

సౌందర్యమే తనకు
శాపమై పోయెనని
అది ఒక్కటే తనకు
అద్ది చూపద్దని
పాతివ్రత్యం తోనె
పరిమితం కాదని
పాండిత్యం, విద్వత్వం
వీరత్వం, ధీరత్వం,
దైవత్వం, చేతనత్వం
తనకూ ఉన్నాయని...

కవయిత్రిగ, వీర వనితగ,
వైద్యురాలిగ, లాయరుగ,
శాస్త్రజ్ఞురాలిగా,
ఉపాధ్యాయినిగా,
సంఘ సంస్కర్తగా,
ప్రధానిగా, పైలట్టుగా,
దేశ అధ్యక్షురాలిగా,
అనేక రూపాలుగా...

విద్యలో, వ్యాపారంలో
ఉద్యోగంలో, ఉపాధి కల్పనలో
రాజకీయంలో, రణరంగంలో
పురుషులను మించుతూ
ఘనతలు వహిస్తూ...
ప్రతిభ కనపరిచినా....

వ్యాపార నీతితో,
నీచ దుర్భుధ్ధితో
ఆటగా పాటగా
వనిత గతి మార్చుతూ
ఆధునిక అందాల
పోకడలు మించుతూ
వయ్యారి భామగా
నిలబెట్టు సంఘాన
వాణిజ్య బిందువుగ
బలిపెట్టు వేదికన
నిప్పు రాజెయ్యాలి!
తప్పు సరిదిద్దాలి
వాగ్దేవిలా మారి
వాగ్ధాటి పెంచాలి!
ఆస్తిపాస్తులె కాదు
అతివలకు ఇకముందు
అస్తిత్వముండాలి!!
అస్తిత్వముండాలి!!
చులకనగ చూస్తిరా
చెలగి ఛెండాడాలి!!
చతురతను చూపిరా
చరిత గతి మార్చాలి!!

అర్థనారీశ్వరుని అర్థ పరమార్థం
స్త్రీ పురుషులిరువురూ
సరిసమానమని!
చాటాలి సత్యమిక!
చాటాలి నిత్యమిక!
వైకల్యమంతయూ
వదలి పోయేదాక!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు