కొత్త ఉదయం
చీకటిని చీల్చుకుని
తూర్పు దిక్కు ఆకాశానికి
సింధూరం పూసిన
ప్రభాత సూర్యుని
లేలేత కిరణాలు
ఓ స్త్రీని మేలుకొలిపాయి!
వాకిట్లో ముగ్గేయమని కాదు!
ఓ స్త్రీని మేలుకొలిపాయి!
పూజకు పూలు కోయమని కాదు!
ఓ స్త్రీని మేలుకొలిపాయి!
భర్తకు టూత్ పేష్ట్ అందించమని కాదు!
ఓ స్త్రీని మేలుకొలిపాయి!
వంటింటి పని చూడమని కాదు!
ఓ స్త్రీని మేలుకొలిపాయి!
అత్తగారికి సేవ చేయమని కాదు!
కానీ మేలుకొంటున్న ప్రతిసారీ
స్త్రీ... ఇది తనకు మాత్రమే
నిర్దేశించబడిన ధర్మమని,
తన కర్తవ్యమని భావించింది!
సనాతన ధర్మంలో స్త్రీ కి
ఉండవలసిన గుణం
ఇది మాత్రమే అనుకుంది!
బాల భాస్కర కిరణాలు
ఆమెని చూస్తున్నాయి!
ప్రతి మేలుకొలుపులో స్త్రీని
గమనిస్తూనే ఉన్నాయి!
ఆమెకి నిజమైన మెలకువ
ఎప్పుడొస్తుందా అని!
వెయ్యి కిరణాలతో
ఎదురు చూసాయి!!
కాలం ఒళ్ళు విరుచుకుంది!
తూర్పు కిరణాలు ఈసారి
ఆమె మేలుకోవడం చూసాయి!
ఒక మహిళా శక్తిగా ఆమె
ఎదగడం చూసాయి!
తనను అణగదొక్కుతున్న
శక్తులని ప్రశ్నించడం చూసాయి!
పురుషాధిపత్యానికి ఆమె
సవాల్ విసరడం చూసాయి!
ఇప్పుడు ఆ కిరణాలు
ఆకాశానికి సింధూరం కాదు
అరుణ వర్ణం పూసాయి!
ఒక కొత్త శకానికి
స్వాగతం పలికాయి!!
మహళాభ్యుదయ కాలానికి
కొత్త ఉదయాన్నిచ్చాయి!!
Comments
Post a Comment