పాప ఫలితం అనుభవించాల్సిందే

ఆకాశంలో మేఘాలను
దులుపుతున్నట్లు
నిటారుగా పొడవుగా
ఎదిగిన మహా వృక్షాలూ
మీకు వందనం!

తీక్షణమైన ఎండ వేడిన
గొడుగులుగా విస్తరించి
మాకు నీడనిచ్చే వృక్షరాజములూ
మీకు వందనం!

చల్లని మలయ మారుతముకు
చక్కని ఔషధీ పరిమళాలు
అందిస్తూ మమ్ము ఆరోగ్యవంతులను
జేసే వన ఔషధ వృక్షములారా
మీకు వందనం!

ఫల పత్ర పుష్పాదులతో
దేవతార్చనకై మీ తరులు
చేయు త్యాగములకు
నా వందనం!

మీ ఉనికి లేనిదే
ప్రకృతి శోభించదని తెలిసీ
మా సోదరులు మీ జాతులను
కర్కశంగా ఖండిస్తుంటే
మీరు క్షమించిననూ
వన దేవత క్షమించదు!
వాయువు క్షమించడు!
వరుణుడు క్షమించడు!
అరుణుడు క్షమించడు!
తుదకు భూమాతయూ క్షమించదు!!

పాప ఫలితం అనుభవించనిదే
మా నర జాతికి మోక్షం లేదు!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు