భయంగా ఉంది తల్లీ

తల్లీ నువు ఏడుస్తున్నా
పొగిడేవాళ్ళెందరో
తల్లీ నిను శుష్కింప జేస్తూ
సారే జహాసె అచ్ఛా అంటారు వీళ్ళు
నీ కీర్తి కిరీటం కొట్టేసి
గిల్టుది నీ తలపై పెట్టారేమో!
నిన్ను పూర్తిగా వాడుకోవడంలో
వీళ్ళంతా సిద్ధహస్తులు!
వట్టిపోయిన ఆవును
స్లాటర్ హౌస్ కి తరలించి నట్లు
ముదుసలి అయిన తల్లిని
ఓల్డేజ్ హోమ్ కి పంపినట్లు
వీళ్ళు నిన్ను ఏంచేస్తారో
భయంగా ఉంది తల్లీ!!

ఇంత స్వార్థ పరులైన బిడ్డలను
ఎందుకు కంటున్నావు తల్లీ!

నీ గతవైభవ చిహ్నాలు
ఇంకా సముద్ర గర్భం లోనో
భూమి పొరల్లోనో
పర్వత గహల్లోనో
దర్శన మిస్తుంటాయి

అవి చూసి మురిసిపోవటమే గానీ
ఈ ఉప ద్రవాలను ఆపలేకున్నాము.
భావితరాలకు నిన్ను
స్వర్గధామంలా అందించాలనే
స్వప్నం నిజం చెయ్యమని
ఆ దైవాన్ని వేడటం తప్ప
ఏమీ చెయ్యలేక పోతున్నాం!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు