నరమేధం జరుగుతోంది
నరమేధం జరుగుతోంది!
నరమేధం జరుగుతోంది!
నరరూపంలో రక్కసి
జడలు విప్పి తిరుగుతోంది!!
తన మతమే ధరణిపైన
రాజ్యం చెయ్యాలంటూ...
పరమత సహనం చచ్చిన
ఉగ్రమూక పిశాచాలు
కత్తులతో కుత్తుకలను
కోసి చంపుతున్నవి!!
బాంబులతో బెదిరిస్తూ
ఆత్మాహుతి పాల్పడుతూ
వందల సంఖ్యన రోజూ
జనహననం చేస్తున్నవి!!
రాజకీయ కుతంత్రాల
పొరుగు రాజ్య పెను రాక్షసి
రణ రక్తపు దాహంతో
అనుదినమూ తపిస్తోంది!!
మన ఎల్లలు చెరిపేసి
మన సంస్కృతి తుడిచేసి
మన శాంతిని భగ్నపరచి
మరణకాండ చేస్తోంది!!
నరమేధం జరుగుతోంది!
నరమేధం జరుగుతోంది!
నరసింహునిగా మారి
నారాయణుడొచ్చునా!
ప్రళయ రుద్రుడై మారి
పరమశివుడు వచ్చునా!
ఢమఢమఢమ నాదంతో
ఢక్కాలను మ్రోగిస్తూ
ప్రమధగణాలన్నీ
పరుగున దిగి వచ్చునా!!
నరమేధం సృష్టించే రాజ్యం ఏదైనా
నరకాసుర తీరుగనే అంతం కావాలి!!
Comments
Post a Comment