తెగులు భాష

తెలుగు వేదికలపై
తెగులు పుట్టింది!
తెగులునే తెలుగుగా
పరిచయం చేస్తూ...
పచ్చి దుర్భాషలే
వాడుక పదాలు చేస్తూ...
నటులూ,కవులూ,
వ్యాఖ్యాతలూ
అనే తేడా లేక...
సభ్యతను గాలికి వదిలి
బూతే ఒక హాస్యరసంగా
బుల్లితెరపై, వెండి తెరపై
వెకిలి వేషాలు కట్టే
కళా ప్రముఖులు...

బూతే ఒక వాగ్ధాటిగా
చట్టసభలలోనా
జన సభలలోనా
ఆవేశ ప్రసంగాలతో
శబ్ధ కాలుష్యం చేసే
ప్రజా నాయకులు...

ఒకరిని మించి ఒకరు
పోటీ పడి చేస్తున్నారు
తెగులు భాషా వ్యాప్తి!

ఇకనైనా ఈ తెగులుకి
మందు వెయ్యకపోతే
భాషా పాండిత్య క్షేత్రానికి
ఈ నేల పనికిరాకుండా పోతుంది!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు