చైతన్య మహిళ
ఆమె కన్నులు కలువ రేకులే!
కానీ అవి నన్ను ఆకర్షించటంలేదు!!
ఆమె కనుల ఆందోళన ఛాయలు
నన్ను ఆలోచింప జేస్తున్నాయి!
ఆమె కొటేరేసిన ముక్కును చూసి
కవులు సంపెంగ ముక్కని వర్ణిస్తారేమొ!
కానీ అదురుతున్న ఆ ముక్కు పుటలు
నన్ను ఆలోచింప జేస్తున్నాయి!!
తీర్చి దిద్దిన ఆమె పెదవులు
చూసి చలించని దెవరని!!
కానీ వణికే ఆ పెదవుల వెనుక
భరించలేని దుఃఖం
నన్ను కదిలిస్తోంది!
కదిలే కలహంస అని
నేను కీర్తించలేను!!
ఆమె కదలికలో ఆవేశం
దూసుకు పోతున్న
మిన్నాగులా ఉంది!
ఆమె అబల కాదు!
సమాజంలోని కుళ్ళుని
కడగాలని కదులుతున్న మహిళ!
చైతన్యం ఊపిరిగా జ్వలిస్తూ
అసమానతల పై సంధించిన
అస్త్రంలా ఉంది ఆ మహిళ!!
Comments
Post a Comment