దించితే దిగుతారు

నీ కంటి నీటితో పండించినావా!
నీ చెమట చుక్కతో సాగుచేసావా!
నీ కండ్లు విప్పార్చి కాపు కాశావా!
నీ కండ కరిగించి నూర్పులూడ్చావా!
నీ శ్రమను దోచేటి దొంగలున్నారనీ
నీ ఋణం పెంచేటి స్వాములున్నారనీ!

తెలిసి వేస్తున్నావు ఏటేట పంటలు!
ఎరిగి మోస్తున్నావు తీరని బరువులు!

నీ త్యాగమునకింక విలువ ఎక్కడిది!
నీ దేశమున ఉనికి నీకు ఎక్కడిది!
నీ బాధలతొ వీరు ధనవంతులౌతారు!
నీ వ్యధలతో వీరు వ్యాపారులౌతారు!
నీ కోపముకు నీకు సంకెళ్ళు వేస్తారు!
నీ కోసమంటూనె నిన్ను ముంచెస్తారు!

కర్షకుడ నీ హక్కు కోసమై నిలబడు!
సంఘటిత శక్తిగా మారి పోరాడు!
నీ సేవ జేస్తమని గెలిచినారందరూ!
నువు దించగలవని తెలిసి దిగుతారు!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు