రాతి జీవి
ఎండ వేడికి అరికాళ్ళు
నేలకి అంటుకుపోతున్నాయి
కళ్ళ వెంబడి నీళ్ళు
సుడులు తిరుగుతున్నాయి
వంటిలో నీరు ఇగిరి పోతోంది
ప్రాణం జివ్వు...న లాగుతోంది
అడుగు అడుగుకీ ఆర్తనాదం
గొంతు వరకూ వచ్చి ఆగుతోంది
భరించలేని బాధను
పంటి బిగువున నొక్కుతూ
తల మీద ఇటుకల బరువును
తల చుట్టతో భరిస్తూ
దినమంతా పనిచేస్తేనే
దినసరి వేతనం దక్కేది!
చెట్టు నీడన తన చంటి పాప
ఆకలితో ఏడ్చినా
పాలిచ్చి రాలేని పాడు బతుకు!
పగిలి పిండైన ఇటుకల గుండలా
గుండెలవిసి ఏడ్వాలన్నా
ఏడ్వలేని దుస్థితిలో
ఏడ్చినా ఫలితం లేదను
నైరాశ్యంలో... గట్టిపడి
ఇటుక గోడలా మారిన హృదయం
స్వేదాన్ని తుడుచు కుంటూ
గుక్కెడు నీటితో
గొంతు తడపుకుంటూ
ధనికుల విలాస నివాసాలకు
రాళ్ళు మోస్తోంది!!
రాతిజీవియై తన బిడ్డను
రాళ్ళపాలు చేస్తోంది!!
Comments
Post a Comment