కవితల గోదావరి

సరళమైన భాష లోనే
నా కవితల గోదావరి
కవి సీమలు తాకుకుంటూ
ప్రవహిస్తూ పోతుంది!

పొడిబారిన స్వర తీరాలను
తడిపి హాయినిస్తుంది!
సడిచేయని నవ హృదయాలను
తాకి  పలుకరిస్తుంది!

సరళమైన భాషలోనే
నా కవితల గోదావరి
మది వీణలు మీటుకుంటూ
మధురిమలను కలిగిస్తుంది!

పండితులకు జీవధారగా
పామరులకు తేనెతీగగా
ఆశాదిశ అమృతఝరిగా
ఊటలూరి వస్తుంది!
పులకరింత తెస్తుంది!

సరళమైన భాషలోనే
నా కవితల గోదావరి
సుతిమెత్తని భావజలధిగా
సృజన కవులనలరిస్తుంది!

వేసారిన విధి వంధ్యులకు
వేదంలా వినిపిస్తుంది!
పోటెత్తే ఆవేశాలకు
జలపాతం అవుతుంది!
అందమైన ఆలోచనలకు
అలల కెరటమౌతుంది!

సరళమైన భాషలోనే
నా కవితల గోదావరి
తెలుగువెలుగు తరగలతో
తేటగీతమౌతుంది!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు