గరళ కంఠుడు మనుజుడే

కాలమా నిన్ను నడిపే యంత్రమేది?
ధర్మమా నిన్ను నడిపే పాదమేది?
దైవమా నిన్ను నడిపే శక్తి ఏది?
మనిషి ఎరిగిన సత్యమెంత?
మనిషి చదివిన జ్ఞానమెంత?
మతం ముందా? హితం ముందా?
గతం నేర్పిన అనుభవాలే
వర్తమానపు గ్రంధమైతే
వర్తమానపు భాష పటిమకు
బీజమెక్కడ పడ్డది?

దేవ రాక్షస గుణములన్నీ
మనిషి లోనే పోరుతున్నవి!
పాల మనసును చిలికి చిలికి
మంచి చెడులను తోడుతున్నవి!
విషము మాత్రమె చిందుతున్నది
అమృతము ఏనాడు వచ్చును?
కష్ట నష్టపు బాధలన్నీ
హాలాహలమై పొంగుతుంటే,
గొంతులోనే పట్టి ఉంచిన
గరళ కంఠుడు మనజుడే!!
కాలధర్మం అనుసరిస్తూ
కలిన నలిగెను మనుజుడే!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు