ఆపే దేవుడు ఎవడని?
నల్లదొరల నల్లతెరల
నల్లధనపు నల్లబతుకు
తెల్లరంగు బట్టలతో
బట్టబయలు కాదెప్పుడు!
సగటు మనిషి వెగటు బ్రతుకు
సెగలు పుట్టు పొగలబట్టు!
చెమటలోడ్చి దాచిన దిక
చెల్లకుండ తగలబట్టు!
జనం ధనం ఖాతాల్లో
దొంగ ధనం గోతాల్లో
ఎక్కడుంది ఎక్కడుంది
చిక్కుబడిన ప్రజాధనం!
అర్థాకలినలమటించి
వ్యర్థానికి వెచ్చించి
జేబు చిల్లు పడుతుంటే
గుండె గళ్ళు పడుతుంటే
బిక్కమొహం వేసుకున్న
దుఃఖ గళం పూడ్చుకున్న
దిక్కులేక బతుకుతున్న
పేదమధ్య గతుల జనం
వెతుకులాడుతున్నది
ఆథారమెక్కడున్నదని!!
నా స్వతంత్ర భారతాన
స్వేఛ్ఛ రాచబంధువుకే!
జన రక్తం పిండుతున్న
ఘనతెరిగిన ఘనులకే!
ఈ నష్టం ఈ కష్టం
ఇంకానా? ఎన్నాళ్ళని?
అవినీతి రీతి సాగకుండ
ఆపే దేవుడు ఎవడని?
అడుగుతోంది మధనపడ్డ
ప్రతిగుండె క్షణక్షణం!!
అడుగుతోంది మధనపడ్డ
ప్రతిగుండె క్షణక్షణం!!
Comments
Post a Comment