అహం
నెరిసిన గెడ్డం నాకున్నా
నునుపైన చెక్కిలి నీకుండాలి!
తలపై చంద్రబింబం నాకున్నా
ఒత్తైన కురులు నీకుండాలి!
వదులైన కాయం నాదైనా
బిగువైన రూపం నీకుండాలి!
నా ఛాయ గోధుమ రంగైనా
నీ ఛాయ పసిడి కాంతులీనాలి!
నేను నవ్వితే తుంపర్లు చిందినా
నువ్వు నవ్వితే ముత్యాలు మెరియాలి!
బుల్డోజర్ లా నేను నడుస్తున్నా
భువనమోహినివై నువ్వు నిలవాలి!
పురుషాధిక్య సమాజంలో
ఎంచుకునేది నేనైతే...
ఎంపిక కావలసింది నువ్వు!!
యుగాలనాటి ఈ పరంపరలో
మార్పు తేవాలని నీకున్నా
మారనివ్వదు మా అహం!!
Comments
Post a Comment