చెప్పు అంటే చెబుతాను.
చెప్పు లేకుండా నడుస్తామా చెప్పండి!
చెబితే నవ్వుతారు గానీ
చెప్పు గురించి చెప్పాల్సిందే!
ఆకు చెప్పుతో మొదలై
తోలు చెప్పులతో వర్థిల్లి
రబ్బరు చెప్పుల రుచి మరిగిన మనకి
రంగు రంగులలో దొరికి
రెక్సిన్, ఫోమ్ లలో పెరిగి
ఉత్పత్తి రంగాన్ని కుదుపు కుదిపే శక్తి
చెప్పుకే ఉందని చెప్పక తప్పదు!
ఎత్తు చెప్పులేసుకుని
టక్కు టక్కు మంటూ నడిచే
వయ్యారి భామలకి కోపమొస్తే
లాగి బైటకి తీసే ఆయుధమే చెప్పు!
చెప్పు తెగుద్ది! సెప్పిచ్చుకు కొడతా!
అనే మాటలు నిత్యజీవితంలో పాపులర్!
నచ్చని స్టేజి షో పైకి జనం నుండి
దూసుకు వచ్చే నిరసన రూపమే
చెప్పని చెప్పడం అతిశయోక్తి కాదు!
తేలు కనిపిస్తే కోడి కోడంటూ
చెప్పుతో కొట్టే సంస్కృతి మనది.
రాములోరి చెప్పు మొదలు
సాములోరి చెప్పు వరకూ
ఏ బాబా చెప్పు చూసినా మొక్కేస్తాం!
చెప్పుకిచ్చే గౌరవం ఇంతా? అంతా?
చెప్పేటంత వాణ్ణి కాదు గానీ
ప్రతి ఇంటా కట్టుకోవాలి
చెప్పులకొక గూడు!!
ప్రతి చోటా దొరకాలి
చెప్పులు కుట్టేవానికి కూడు!
Comments
Post a Comment