నమో భూమాత! నమో నమో!
అమ్మా భూమాత!
నీ పంచ ధాతువులతో
శరీర ధారులమైన మేము
మనుషులుగా గర్విస్తున్నాం!
కానీ... చెదపురుగులను చూసి
చీదరించుకునే మేము
నీ పాలిట నిజంగానే
చెద పురుగులం అయ్యాం!
భూమిని దొలిచేస్తున్నాం!
చెద పట్టినట్లు ...
అడవులు, కొండలు,
కోనలు, లోయలు...
అంతటా వ్యాపించి
నీకు దుఃఖం కలిగిస్తున్నాం!
నువ్వు కంపిస్తే కదిలిపోయే మేము
నువ్వు కోపిస్తే సమాధి అయ్యే మేము
నీకు పట్టిన రోగంలా
నిన్ను వేధిస్తూనే ఉన్నాం!
నీటి కోసం నిన్ను తూట్లు పొడుస్తాం!
కూటికోసం నిన్ను దున్ని పడెస్తాం!
గూటి కోసం కొండలు పిండి చేస్తాం!
నీ గర్భంలోనికి చేరి
అణ్వాయుధ ప్రయోగాలు చేస్తాం!
నీలో ఉన్న ఖనిజాలను
తవ్వి తవ్వి మరీ తీస్తాం!
నీ కన్నీటి చారికలు
ఎండిన నదులౌతున్నా...
వాటిపై ఆనకట్టలు కడతాం!
ఈ నిత్య బాధను భరిస్తూ
మా తప్పులను క్షమిస్తావు కనుకనే
సహనానికి మారుపేరుగా
నిన్ను కీర్తిస్తూ ఉంటాం!!
నమో భూమాతా! నమో నమో!!
Comments
Post a Comment